Sunday, August 15, 2010

అప్పట్లో మనం.....

రవి గారు రాసిన రెడిఫ్ ముచ్చట్లు చదివాక నా కళ్ళ ముందు ఒక్కసారిగా గుండ్రాలు గుండ్రాలు కనిపించి నా పి.జి రోజుల్లోకి లాక్కెళ్ళాయి.పొద్దున్నే ఆరు గంటలకు నిద్ర లేవకపోతే బుర్ర వాచి పోయెలా క్లాస్ పీకే అమ్మ, టైం బాలేక స్నేహితులతో ఏ బేకరి దగ్గర టీ తాగుతూ నాన్న కు దొరికిపోతే అక్కడెందుకు ఉన్నావ్ ఏం చేస్తున్నావ్ లాంటి ప్రశ్నలకు వివరణలు ఇచ్చుకోలేక నా అంతరాత్మ దేశం లో అందరికీ స్వతంత్ర్యం వచ్చింది నీకు తప్ప అని నా మీదే జాలి చూపిస్తే మేరా నంబర్ కబ్ ఆయేగా అని ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి.అప్పటికీ నా కాలేజ్ విషయం లో ఇంట్లో పెద్ద మహా భారత యుద్ధం జరిగింది. మా నాన్న గారు పైకి ఎంత అమాయకుడిగా కనిపించినా ఆయన బుర్ర జేంస్ బాండ్ కంటే ఫాస్ట్ గా పని చేసేది. నా రాంకు తెలియగానే ఆ రాంకు కు ఎక్కడ సీటు వస్తుంది లాంటి విషయాలు తెలుసుకోవడానికి ఒక ఎంక్వయిరీ కమిటీ వేసి, ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నన్ను తిరుపతి లో ఒక పరమ స్ట్రిక్టు కాలేజి లో చేరాల్సింది గా ఆదేశాలు జరీ ఐపోయాయి.నా డిగ్రీ క్లాస్మేట్స్ ఆ కాలేజి లో ఒక్కరు కూడా లేరు నాన్నా అంటే, అందుకేరా నిన్ను అక్కడ చేరమన్నది అని ఒక సెటైర్ వేసి, ఇక ఆ కాలేజి విశేషాలు చెప్పడం మొదలు పెట్టారు.

కాలేజి తిరుపతికి 15 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది,ప్రశాంతమైన వాతావరణం కాలేజి చుట్టూ పెద్ద మామిడి తోట. ఖచ్చితంగా ప్రతి సెమిస్టరు 75 శాతం మినిమం హాజరు ఉండాలి, లేకపోతే రోజుకు 60 రూపాయలు ఫైన్ కట్టాలి, ప్రతి వారము ఒక ఇంటర్నల్ ఎక్జాం ఉంటుంది, ఆ ఎక్జాం రాయక పోతే 120 రూపాయలు ఫైన్ కట్టాలి. కాలేజి ప్రిన్సిపాల్ ఐ ఐ టి లో MTech చేశాడంట.ఇంతకంటే మంచి కాలేజ్ ఏదుంటుంది అని మా నాన్న గారు తన్మయత్వం తో చెప్తుంటే , నీకివన్నీ ఎవరు చెప్పారు నాన్న అని అడిగితే ఇంకెవరు మా మేనేజర్ కొడుకు అక్కడే చదువుతున్నాడు, అందుకే నిన్ను అక్కడే చేర్పిస్తున్నాడు. అసలు మా మేనేజర్ వాళ్ళ అబ్బాయి ఇంగ్లీషు ఎంత బాగా మాట్లాడతాడో తెలుసా నువ్వు వున్నావు ఎందుకు దండగ,మొదటి సారి ఇంటి నుంచి బయటకు పంపుతున్నాను, నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు.అంటూ సెంటిమెంటు, వార్నింగు కలగలిపిన డైలాగులతో ఆ రోజుకు భగవద్గీతా పారాయణం ముగిసింది.
తిరుపతికి వెళ్ళడం కౌన్సిలింగ్ లో ఆ కాలేజ్ లో చేరడం జరిగిపోయాయి.నా ఫ్రెండ్స్ అంతా తమ తమ సంతాపాలను తెలియ చేస్తూ నన్ను తిరుపతికి సాగనంపారు.కట్ చేస్తే తిరుపతి బాలాజి కాలని.

********************************************************

కాలేజికి హాస్టల్ లేకపోవడం తో బాలాజి కాలనీలొ ఒక హాస్టల్ లో చేర్పించి ఎప్పటి లాగే భగవద్గీతా పారయణం చేయించి నాలుగు అక్షింతలతో ఆశీర్వదించి మా నాన్న గారు తిరుపతి బస్టాండ్ లో బస్సు ఎక్కగానే బాక్ గ్రౌండ్ లో సాంగ్ మొదలయ్యింది అనుభవించు రాజా అనుభవించు రాజా అంటూ.అటు మావూరి బస్సు కదలగానే షర్ట్ పై బటన్ తీసేసి, చేతులు పైకి మడిచి వీలైనంత నిర్లక్ష్యంగా బయటకు రాగానే రైల్వే స్టేషన్ దారి కనిపించింది. అహా రైల్వేస్టేషన్ లో అమ్మాయిలకు లైన్ వేసి ఎన్ని రోజులయ్యింది అనుకుంటూ రైల్వే స్టేషన్ వైపు సాగిపోయాను.ఒక అరగంట సేపు చుట్టుపక్క పరిసరాలను సర్వే చేసి గ్రూప్ థియేటర్ల వైపు తిరిగి ఇవే కదా ఇంకొక మూడు సంవత్సరాల పాటు మన అడ్డాలు అనుకుంటూ హాస్టల్ కు బయలు దేరి, బాలాజి కాలనీ లో దిగాను సరి కదా, ఇంతకు ముందు నాన్న ఉండటం తో గమనించలేదు కాని, ఆ సందులో మొదటి నుంచి చివరి వరకు అన్నీ అమ్మాయిల హాస్టల్లే, మాది ఒక్కటే అబ్బాయిల హాస్టల్, దెబ్బకు నాలోని ఆత్మారాముడు బయటకు వచ్చీ తీన్ మార్ డాన్స్ చేసి ఒరే అదృష్టం అంటే ఇదేరా, దేవుడున్నాడురా ఇన్ని సంవత్సరాల నీ బాధను గుర్తించి నిన్ను ఇక్కడకు రప్పించుకున్నాడు, భక్తి రక్తి రెండు ఒకే చోట ఉండటమంటే ఇదే కాబోలు అని సంబర పడిపోయాడు.ఆ నిమిషం లోనే నిర్ణయించుకున్నాను బాలాజి కాలనీలో ఒక్క అమ్మాయినైనా పడేయకుండా అక్కడ నుంచి కదల కూడదని.ఇక తిరుపతి లో నా కాలేజి విశేషాలు, అమ్మయిల కోసం ఆరాటాలు, వాళ్ళ వల్ల పడ్డ కష్టాలు, చేసిన పోరాటాలు తరువాతి టపాల్లో.